sound of rain

వర్షం సవ్వడి..

జోరుగా వర్షం. వర్షం కురుస్తోంది అని కిటికీ లో నుండి తెలుస్తూనే ఉంది. కరెంట్ కూడా పోయింది. దాంతో జోరుగా తిరిగుతున్న ఫ్యాన్ శబ్దం, పక్క అపార్ట్మెంట్ బిల్డింగ్ లో అదే పనిగా ఆడుతున్న మోటర్ శబ్దం, ఎదురింటి టి. వి. సీరియళ్ల మోత, ఒక్క సారిగా ఆగిపోయాయి.

అంతటా నిశ్శబ్దం.. ఒక్క వాన చినుకుల సవ్వడి తప్ప. ఒక్కో సారి నిశ్శబ్దం కూడా పాతబడిన కొన్ని శబ్దాలను మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తుంది.

సరిగ్గా అప్పుడు నా ధ్యాస వర్షం సవ్వడి మీదకు మళ్లింది.
సిమెంటు గోడను తాకిన చినుకుల సవ్వడి,
ఇనుప రేకుల షెడ్డు మీద పడే చినుకుల సవ్వడి,
కిటికీ గాజు మీద ఏటవాలుగా దాడి చేసే చినుకుల సవ్వడి,
బాల్కనీలో మొక్కల ఆకులని గట్టిగా హత్తుకుని తడిమేయటానికి శరవేగంగా వచ్చి తాకుతున్న చినుకుల మెత్తటి సవ్వడి,
అన్నేసి చినుకులని దోసిళ్ళతో పట్టి దాచుకోవటానికి కుదరని డాబాలు ఒక మూలగా ధారగా కార్చే వాన నీటి సవ్వడి,
అలా కారి ఒక దగ్గర నిలబడ్డ వాన నీటిలో చేరటానికి ఉరుకుల పరుగుల మీద వచ్చి దూకే కొత్త చినుకుల సవ్వడి..
బుడుక్.. బుడుక్..!
వీటికి తోడు చాలా అరుదుగా వచ్చే మా నాన్న కోపం లా అప్పుడప్పుడు ఉరుము సవ్వడి,

అన్నీ ఒకటి కానే కాదు.. మనసు పెట్టి వింటే!
అందుకే వర్షం పడుతున్న శబ్దం అని ఒక్క మాటలో తేల్చేయటానికి మనసొప్పలేదు.

కళ్ళు మూసుకుని, ఏ ఆలోచనలకు తావివ్వకుండా కూచుని గమనిస్తే.. కచ్చేరీ నే. ❤️
బయటకెళ్ళి వర్షం లో తడవనక్కరలేకుండానే ఈ వాన చినుకుల సంగీతం నా మనసుని నిలువెల్లా తడిపేసి, కడిగేసింది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.